తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఒకరకంగా.. దక్షిణాది రాష్ట్రాలకు మరో రకంగా బడ్జెట్ కేటాయించారని భట్టి నిలదీశారు.
తెలంగాణ ఏర్పాటుపై (telangana) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వీటిని నిరసిస్తూ టీఆర్ఎస్ (trs), కాంగ్రెస్‌లు (congress) తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) మాట్లాడుతూ.. బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ సభలో కూడా లేరన్నారు. అందరిని ఒప్పించేందుకే అంత సమయం పట్టిందని భట్టి తెలిపారు. బిల్లు పాస్ చేసేటప్పుడు.. తలుపులు మూసే ఓటింగ్ చేస్తారని విక్రమార్క చెప్పారు. మోడీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే.. కేసీఆర్ సైలెంట్‌గా వున్నారని భట్టి ఎద్దేవా చేశారు.
ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కేసీఆర్ (kcr) పార్లమెంట్‌కు పోలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌ను నమ్మే పరిస్ధితి లేదని భట్టి ఎద్దేవా చేశారు. మోడీ వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించాలని విక్రమార్క డిమాండ్ చేశారు. రామానుజులెక్కడ.. దేశంలోని మతాలను విభజించి , ఇంకో మతాన్ని ద్వేషించే మోడీ ఎక్కడ అని భట్టి మండిపడ్డారు. రామానుజల ఫిలాసఫీకి.. మోడీ ఫిలాసఫికి పొంతనే లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఒకరకంగా.. దక్షిణాది రాష్ట్రాలకు మరో రకంగా బడ్జెట్ కేటాయించారని భట్టి నిలదీశారు. ఈ వివక్ష ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
దేశ ప్రధాని పదవిలో వున్న వ్యక్తి.. దేశంలోని అన్ని రాష్ట్రాలను, వర్గాలను, కులాలను, మతాలను సమానంగా చూడాలని విక్రమార్క హితవు పలికారు. ఆయన చూపే విభజన అని.. కులాలను, మతాలను, ప్రాంతాలను విభజించి చూస్తారంటూ మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికే పన్నుల రూపంలో అధిక మొత్తంలో వెళ్తుందని భట్టి చెప్పారు. కానీ పంపకాల సమయంలో మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వస్తుందని ఆయన మండిపడ్డారు. ఇంత వివక్ష చూపే నరేంద్ర మోడీ.. సమతామూర్తి విగ్రహావిష్కరణకు తగునా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మోడీ దేశ ప్రధానిగా కాకుండా అక్కసుతో మాట్లాడారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదన్నారు. తెలంగాణకు తల్లిలా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని జీవన్ రెడ్డి ప్రశంసించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఆర్పించిన వాళ్లలో బీజేపీ వాళ్లు ఎవరైనా వున్నారా అని ఆయన నిలదీశారు. మోడీ.. కాంగ్రెస్‌ను దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లలో విభజన హామీలు అమలు చేయకుండా .. మోడీ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేసీఆర్, నరేంద్ర మోడీలు ఇద్దరూ కారణమేనని జీవన్ రెడ్డి మండిపడ్డారు. భారతదేశ ఐక్యత కోసం ప్రాణాలు ఆర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలదేనన్నారు.
