ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో స్వపరిపాలన, ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భట్టి మాట్లాడారు. ఏ లక్ష్యాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేశారో అవి ఈరోజు నెరవేరడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకొని జీవించేలా చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని ఆక్షేపించారు.
నిధులు ఖర్చు కాకపోతే మరో ఏడాది కేటాయింపులకు ఈ నిధులను బదిలీ చేయాల్సి ఉండగా.. అలా ఎందుకు చేయడం లేదని విక్రమార్క ప్రశ్నించారు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని సీఎల్పీ నేత ప్రజలను కోరారు. దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
