తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు అదనంగా చుక్క నీరు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ అనే పదాలకు అర్ధాలే మారిపోయాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఉప సభాపతిగా విభజన బిల్లును ప్రవేశపెట్టిన తాను కోట్లాదిమంది ప్రజల ఆశలు నెరవేరుతామని ఆశించానన్నారు.

కానీ నీళ్లు, నిధులు, నియామాకాల విషయంలో ప్రజలు నిస్పృహల్లో ఉన్నారని భట్టి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేస్తామంటున్నారు.. అయితే ఆ రోజుల ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారో కేసీఆర్ స్పష్టం చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు.

కేవలం మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేసి, అన్నారం ప్రాజెక్ట్‌లోని నీళ్లు పంపింగ్ చేస్తారు.. 15 శాతం కూడా పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తున్నారంటే.. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని భట్టి చురకలు అంటించారు.

మేడిగడ్డ నుంచి గంధమల వరకు ఎంతమేర పనులు పూర్తి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 15 శాతం పనులకే రూ. 50 వేల కోట్లు వ్యయం అయితే.. మిగిలిన 85 శాతం పనులకు ఎన్ని వేల కోట్లు కావాలని భట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు.