కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.  

4 నెలల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, ఆయన పార్టీని బంగాళాఖాతంలో పడేస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థానికతను కోల్పోయే విధంగా తీసుకొచ్చిన 317 జీవోను రద్దు చేసి గతంలో మాదిరిగానే బదిలీలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. పోలీసులు సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విక్రమార్క పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని.. ప్రజల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలను నాశనం చేయొద్దని భట్టి సూచించారు. ధరణి పోర్టల్ వల్ల బాగుపడుతోందని భూస్వాములు, ఫ్యూడలిస్టులు మాత్రమేనని ఆయన ఆరోపించారు. 

ఇకపోతే .. నిన్న నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది వరకు తెలంగాణను ఆగం చేసినోళ్లే మళ్లీ బయలుదేరారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రబుద్ధుడు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నాడని, కొత్త ముసుగు వేసుకుని కొందరు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు వుండేవన్నారు. ఇవాళ థరణిలో ఏమైనా మార్చాలంటే హక్కుదారుకే సాధ్యమన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపిస్తే లబ్ధిదారులకు న్యాయం జరగదని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణిని కాదు.. దాన్ని వ్యతిరేకించే వాళ్లను బంగాళాఖాతంలో కలిపేయాలని సీఎం వ్యాఖ్యానించారు. ధరణి లేకపోతే రైతుల ఖాతాల్లో డబ్బులు పడవని ఆయన పేర్కొన్నారు. 

Also Read: మళ్లీ ముసుగు దొంగలొస్తున్నారు.. ధరణిని ఎత్తేస్తే రైతాంగం ఆగమే , నిర్ణయం మీ చేతుల్లోనే : కేసీఆర్

ధరణిని ఆగం చేసుకుంటే ఇవన్నీ వస్తాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని వుంచాలా ..? తీసేయాలా ..? మీరే చెప్పాలన్నారు. ధరణితో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం పేర్కొన్నారు. ధరణితో రైతులకే అధికారం ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో దళారీలదే రాజ్యం, పైరవీకారులదే భోజ్యమన్నారు. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, ఎన్ని పోలీస్ కేసులు, ఎన్ని హత్యలు జరిగేవని ఆయన ప్రశ్నించారు. రైతులను మళ్లీ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పే కుట్ర జరుగుతుందని కేసీఆర్ ఆరోపించారు. ధరణి గురించి కాంగ్రెస్, టీడీపీలకి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు , అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు.