తెలంగాణ కాంగ్రెస్ రేపటి నుంచి నిర్వహించనున్న నవ సంకల్ప్ మేథో మథన శిబిర్ నిమిత్తం ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారత్‌లో లేకుండానే సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల రాజస్థాన్‌లో ఏఐసీసీ (aicc chintan shivir) నిర్వహించిన విధంగానే తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) కూడా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) మంగళవారం మీడియాకు తెలియజేశారు. కీసరలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘‘నవ సంకల్ప్ మేథో మథన శిబిర్’’ సమావేశాలు తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని భట్టి అన్నారు. దశాబ్దాల తరబడి పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన నవ సంకల్ప శిబిరంలో లోతుగా చర్చిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం రోడ్ మ్యాప్ సిద్ధం చేసి 2023 సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నవ సంకల్ప మేధోమథన శిబిరంలో రాజకీయ, ఆర్థిక , సామాజిక అంశాలపై చర్చించడానికి ఆరు కమిటీలను వేసినట్లు ఆయన తెలిపారు.
ఒక్కో కమిటీలో ఒక సీనియర్ నాయకుడు కన్వీనర్‌గా, 25 నుంచి 30 మంది సభ్యులుగా ఉంటారని భట్టి వెల్లడించారు. మొదటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు వారికి అప్పగించిన అంశంపైన కమిటీలో లోతుగా చర్చించి వారి చర్చల్లో వచ్చిన సారాంశాన్ని నిర్ణయాలుగా నివేదిక రూపంలో నవసంకల్ప్ ప్రధాన కమిటీకి రెండవ రోజున అప్పగిస్తారని ఆయన తెలిపారు. 6 కమిటీల నుంచి వచ్చిన నిర్ణయాలను మెయిన్ కమిటీ క్రోడీకరించి పీఏసీలో ప్రవేశపెట్టి.. ఆ కమిటీలో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పాలసీగా మేథోమథనం శిబిరం నిర్ణయాలను రెండవ రోజు సాయంత్రం ప్రకటిస్తామని విక్రమార్క వివరించారు. ఈ కమిటీలో ఉండే సభ్యులు భేషజాలకు వెళ్లకుండా, అరమరికలు లేకుండా, తమ అభిప్రాయాలు నిర్భయంగా, స్పష్టంగా, ఆలోచన విధానాలను చర్చించాలని ఆయన సూచించారు. ఒకే సభ్యుడు రెండు మూడు కమిటీలో ఉన్నట్లయితే వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా సంబంధిత కమిటీ కన్వీనర్‌కు అప్పగించాలని విక్రమార్క కోరారు.
కమిటీ కన్వీనర్లు వీరే:
ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్ - పొన్నాల లక్ష్మయ్య,
పోలిటికల్ కమిటీ కన్వీనర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి,
వ్యవసాయ కమిటీ కన్వీనర్ - జీవన్ రెడ్డి
యూత్ కమిటీ కన్వీనర్ - దామోదర రాజనర్సింహ
ఎకానమీ కమిటీ కన్వీనర్ - శ్రీధర్ బాబు
సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కమిటీ కన్వీనర్‌గా - వీ హనుమంతరావు
రేవంత్‌కి కమిటీల్లో దక్కని స్థానం :
అయితే ఈ కమిటీల్లో వేటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) స్థానం దక్కలేదు. అంతేకాదు పీసీసీ చీఫ్ లేకుండా చింతన్ శిబిర్ నిర్వహించడంపై భట్టి విక్రమార్క పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అవసరాలను బట్టి కొందరు అందుబాటులో ఉంటారు, కొందరు ఉండరని కామెంట్ చేశారు. ఇది ఏఐసీసీ కార్యక్రమని.. ఎవరి కోసం కార్యకలాపాలు ఆగవని విక్రమార్క స్పష్టం చేశారు. అలాగే దీన్ని ప్రత్యేకంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు.
జూన్ 2న గాంధీభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు:
జూన్ 2వ తేదీన హైదరాబాద్ గాంధీ భవన్‌తో పాటు పార్టీ జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఆయన సూచించారు.
