తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తున్నామని.. ఇవి మధ్యలో ఆగితే పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ (telangana budget 2022) ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారని.. కానీ అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు కావడం లేదని భట్టి ఎద్దేవా చేశారు. సంపద పెరుగుతుందంటూనే, అప్పులు పెంచారని ఆయన దుయ్యబట్టారు. 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ... ఇందిరమ్మ ఇళ్లపై చర్చకు సిద్ధమా అని భట్టిని ప్రశ్నించారు.
సభను సమన్వయం చేసుకోవాల్సిన ప్రశాంత్ రెడ్డే (prasanth reddy) డిస్ట్రబ్ చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.8 లక్షలు ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. కార్పోరేటర్ బడ్జెట్ కాదన్నారని.. పేదలకు ఏం దక్కిందని ప్రశ్నించారు. వున్న సబ్సిడీలు ఎత్తేసి ధరలు పెంచితే రైతులకు మేలు జరుగుతుందా అని భట్టి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర స్థాయిలో వున్న మంత్రి హత్యకు సుపారీ తీసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని విక్రమార్క నిలదీశారు. మంథనిలో పట్టపగలు న్యాయవాద దంపతులను హత్య చేశారని... ఇక మంత్రికే భద్రత లేనప్పుడు, సామాన్యుల పరిస్ధితేంటని భట్టి ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర గురించిన వాస్తవాలను రాష్ట్రప్రజలకు తెలియజేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యోగులకు మేలు చేయాలన్న ఆయన.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ధూప దీప నైవేద్యాల కోసం పూజారులకు ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని భట్టి డిమాండ్ చేశారు. గీత కార్మికుల ఇస్తామన్న పెన్షన్ హామీని కూడా నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
ప్రాజెక్ట్‌లను తమకు అప్పగించాలని కేఆర్ఎంబీ (krmb) , జీఆర్ఎంబీలు (grmb) కోరుతున్నాయని.. ఇంకోసారి ఇవన్నీ అక్రమ ప్రాజెక్ట్‌లనీ పనులు ఆపాలని చెబుతున్నాయని .. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నదీ జలాల గురించి అని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని.. రేపు అనుమతులు పేరు చెప్పి వీటికి అడ్డు తగిలితే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇవి కాకుండా సంగమేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (rayalaseema lift irrigation project) నిర్మిస్తోందని చెప్పారు.
అదే జరిగితే సాగర్ కింద వున్న నల్గొండ జిల్లా పూర్తిగా ఏడారిగా మారిపోతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ (srisailam project) నిండకుండా పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి, హైదరాబాద్ తాగునీటి అవసరాల పరిస్ధితి ఏంటని విక్రమార్క ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదని భట్టి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లు, ఇబ్బందులకు సంబంధించి కేసీఆర్ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 35 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందుతున్నట్లు చెబుతున్నారని కానీ దీనిపై మాకు కొన్ని సందేహాలు వున్నాయని.. వాటిని నివృత్తి చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు.
