తెలంగాణ వనరులను ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కోసం కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నట్లు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ భగీరథ పేరుతో భారీ అక్రమాలకు తెరతీసి సంపాదించిన డబ్బుతో ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.  ఇలా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఖూనీ అవడం పట్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారని భట్టి అన్నారు. 

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, నాయకుల ఫిరాయింపులపై శనివారం జరుగిన రౌండ్ టేబుల్ సమావేశంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డబ్బులు, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని...అయితే ఇలా చేర్చుకోడాని ఉపయోగిస్తున్న డబ్బు ఎవరిదని భట్టి ప్రశ్నించారు. 

ప్రస్తుతం తెలంగాణలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని... దీంతో సామాన్యుల ఉనికి కూడా ప్రమాదంలో పడిందన్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు ఎమ్మెల్యేల జంపింగ్ లు, వాటిని చేర్చుకుంటున్న పార్టీలే కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ది ఉపయోగించాల్సిన డబ్బును ఎన్నికలకు ముందు ఓటర్లను ఆ తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.  

గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే తాము  ఇరిగేషన్ ప్రాజెక్టు రీడిజైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ ను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు భట్టి గుర్తుచేశారు. కానీ అందుుకు ప్రభుత్వం వెనుకడుగు వేసిందని...దీన్ని బట్టే వాటిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు అర్థమవుతోందని భట్టి వెల్లడించారు. 
 
ఈ రౌండ్ టేబుల్ సమవేశంలో టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్‌.రమణ, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, చాడ వెంకటరెడ్డి, వి.హనుమంతరావు‌, కుసుమ కుమార్‌, కంచె ఐలయ్య, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.