హైద్రాబాద్ హయత్ నగర్ లో విషాదం: టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్ధిని సూసైడ్
హైద్రాబాద్ నగరంలోని హయత్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇతర విద్యార్ధుల ముందు అవమానించిందనే కారణంగా 8వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్కూల్ ఎదుట సూసైడ్ చేసుకున్న విద్యార్ధి పేరేంట్స్ ఆందోళన చేశారు.
హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో తోటి విద్యార్ధుల మధ్య తనను టీచర్ మందలించడంతో 8వ తరగతి విద్యార్ధిని అక్షయ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కూతురు ఆత్మహత్యకు కారణమైన టీచర్ తో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగింది. బాధిత కుటుంబంతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. దీంతో స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హయత్ నగర్ లోని ప్రైవేట్ స్కూల్ లో అక్షయ అనే విద్యార్ధిని 8వ తరగతి చదువుతుంది.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇటీవలనే టీచర్లు మందలించారు. ఈ విషయమై అందరి ముందు తనను టీచర్ మందలించడంతో విద్యార్ధిని తన పేరేంట్స్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై మృతురాలి తల్లి మీడియాకు చెప్పారు. 10 రోజుల క్రితం జరిగిన పేరేంట్స్ సమావేశంలో కూడా తను ఈ విషయాన్ని ప్రస్తావించినట్టుగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృతి చెందిన విద్యార్ధిని తల్లి చెప్పారు.
అయితే నిన్న స్కూల్ లో ఏమైందో కానీ తన కూతురును క్లాసు రూమ్ బయటే నిలబెట్టారని బాధితురాలి తల్లి చెప్పింది. మరో టీచర్ వచ్చి తన కూతురను క్లాస్ లోకి పంపించినా మరో టీచర్ వచ్చి మళ్లీ బయటే నిలబెట్టారని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చిన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆ ఇంటర్వ్యూలో వివరించింది. ఈ ఘటనను నిరిస్తూ విద్యార్ధిని పేరేంట్స్, బంధువులు స్కూల్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విద్యార్ధి సంఘాలు కూడా ఆందోళన నిర్వహించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాయి.