తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు చెలరేగాయి. కొంత మంది యువకుల మధ్య ప్రారంభమైన గొడవ ఘర్షణలకు దారి తీసింది. దుండగులు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో అలర్లు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దుండగులు వాహనాలకు నిప్పు పెట్టారు. భైంసాలోని జుల్ఫెకర్ గల్లీలో ఈ అల్లర్లు చెలరేగాయి. యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. పెద్దమొత్తంలో గొడవ జరగడంతో ఇరువర్గాలు వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. 

పోలీసులు అల్లర్లను ఆపడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అల్లరి మూకలు వాహనాలకు, కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేశారు.

ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. జుల్ఫేకర్ గల్లీ ప్రాంతంలోనే కాకుండా కబీర్ రహదారి, గణేశ్ నగర్, మేదర్ గల్లి, బస్టాండు ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. గాయపడినవారిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్, ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు గాయపడినవారిని నిజామాబాద్, హైదరాబాదులకు తరలించారు. "

డీఎస్పీ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. గుమిగూడినవారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జిల్లా ఇంచార్జీ ఎస్పీ విశ్వ వారియనర్ బైంసాకు చేరుకుని సమీక్షించారు. ఏడాది క్రితం కూడా ఇక్కడ అల్లర్లు చెలరేగాయి.

భైంసాలో అల్లరల్పై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అల్లర్లను ఖండించారు. అల్లర్లలో ఇద్దరు రిపోర్టర్లు, పోలీసులు బిజెపి కార్యకర్తలు గాయపడడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రిపోర్టర్లపై, పోలీసులపై దాడి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అది భైంసానా, పాకిస్తానా అని ఆయన అడింగాడురు, వెంటనే అల్లర్లను ఆపాలని ఆయన పోలీసులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు భయపడి ఒక వర్గానికి కొమ్ము కాయవద్దని ఆయన పోలీసులను కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసాలో తరుచుగా అల్లర్లు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ అన్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు గాయపడినవారిని వెంటనే హైదరాబాదు తరలించాలని ఆయన సూచించారు.