హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో  బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మంగళవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. మంత్రి అజయ్ కుమార్ సమక్షంలో  టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

కేపీహెచ్‌బీ ఫోరం మాల్ సమీపంలో మంత్రి పువ్వాడ  అజయ్ కుమార్ అనుచరులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు  కొందరిని పట్టుకొన్నారు. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఒకరిని పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. 

టీఆర్ఎస్ కు చెందిన వాహనాలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్ కారుపై దాడికి దిగారు. ఈ సమయంలో కారులో మంత్రి లేడు. ఈ కారులో  మంత్రి అనుచరులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.  

టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గొడవ చోటు చేసుకొన్న సమయంలో మంత్రి అజయ్ కుమార్ కూడా అక్కడకు చేరుకొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తాము డబ్బులు పంచుతున్నామని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని నగరంలోని పలు చోట్ల పలు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.