టీఆర్ఎస్ లో అబ్బాయి.. బాబాయి లొల్లి

clashes between leaders in TRS
Highlights

నచ్చచెప్పే ప్రయత్నంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

టీఆర్ఎస్ పార్టీలో కొత్త లొల్లి మొదలైంది.  సొంత బాబాయి.. కొడుకుల మధ్యే అధికారం చిచ్చుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న  బాబాయిని వదిలేసి.. కొత్తగా పార్టీలో చేరిన అబ్బాయికి 
కీలక పదవి కట్టబెట్టడంతో వివాదానికి దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌... తాజాగా పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పదవిని ఆర్నెళ్ల కిందట టీడీపీ నుంచి వచ్చి చేరిన మార్నేని రఘుకు కట్టబెట్టారు. 
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌, అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు మార్నేని వెంకన్నకు రఘు సమీప బంధువు.  ఇద్దరూ వరసకు బాబాయి.. కొడుకులు అవుతారు.

దీంతో మార్నేని వెంకన్న.. రఘుకు అనతి కాలంలోనే పెద్ద పదవి కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఏకంగా మంగళవారం వరంగల్‌లోని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఇంటికి వెళ్లిన మార్నేని వెంకన్న ఇదే విషయంలో ఇట్లా కొత్త వారికి పదవులు కట్టబెడితే సీనియర్‌ల పరిస్థితి ఏమిటని అడిగినట్లు తెలిసింది. పార్టీ అన్నాక కొత్త, పాత అందరు కలిసి పని చేస్తేనే తిరిగి టీఆర్‌ఎస్ కు అధికారం వస్తుందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. 

అంతేకాకుండా ఇంకా ఏవేవో కారణాలు చెబుతూ.. రఘుకు పదవి కట్టబెట్టే విషయాన్ని సమర్థించుకున్నట్లు తెలిసింది. అప్పటికి ఆయన వాదనతో ఏకీభవించని మార్నేని వెంకన్న ‘ఇక మీ ఇష్టం’ అంటూ అలిగి అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత మార్నేని వెంకన్న తన బంధువుల ఇంటికి వెళ్లారని తెలిసి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అక్కడికి వెళ్లి వెంకన్నకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మౌనముద్ర వీడలేదని సమాచారం. ఈ విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

loader