మహాభారతంలోనూ (Mahabharatam) మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేశారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Chief Justice of India NV Ramana) అన్నారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు. 


మహాభారతంలోనూ (Mahabharatam) మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేశారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Chief Justice of India NV Ramana) అన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (International Arbitration and Mediation Centre) సన్నాహక సదస్సులో సీజేఐ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ఆర్బిట్రేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని సీజేఐ పేర్కొన్నారు.

న్యాయస్థానాలను (Courts) ఆశ్రయించే ముందు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు కనుగొనవచ్చని అన్నారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

‘మధ్యవర్తిత్వం మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. మేము మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ముగించగలము. వీలైనంత వరకు,వివాదాలను పరిష్కరించడానికి మహిళలు మధ్యవర్తిత్వం వహించాలి. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు మధ్యవర్తిత్వం చేశారు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఫార్మా, ఐటీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని.. ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా సెంటర్ ఏర్పాటు సాధ్యం అయ్యేది కాదు. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను’ అని సీజేఐ రమణ అన్నారు. 

తెలుగులో మాట్లాడిన సీజేఐ రమణ..
అధికారిక ప్రసంగం పూర్తయిన తర్వాత సీజేఐ రమణ తెలుగులో మాట్లాడారు. తెలుగువారు భోజనం చేసిన తర్వాత పెరుగుతో తినకపోతే సంతృప్తి పడరో.. తాను కూడా రెండు ముక్కలు తెలుగు మాట్లాడకపోతే తాను కూడా సంతోషపడనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగు భాషాభిమాని అని చెప్పారు. తెలుగువారైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పీసీరావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. తీర్పులు చెప్పడానికి కోర్టులు, హంగామా, ఆర్భాటంఅక్కర్లేదన్నారు. సమాజంలో గుర్తింపు ఈ దేశంలో న్యాయం చేయడానికి కోర్టులే కాదు ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చని ప్రధాని, రాష్ట్రపతి సమక్షంలో తాను చెప్పానని అన్నారు. సమాజంలో గౌరవం, గుర్తింపు ఉన్న ఏ వ్యక్తైనా కూడా తీర్పు చెప్పేందుకు అర్హుడేనని వ్యాఖ్యానించారు. సమస్యను అర్థం చేసుకుని విశ్వసనీయత కలిగిన వ్యక్తి తీర్పు చెప్పవచ్చని అన్నారు. 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 
పంచాయతీల్లో వివాదాలను గ్రామ పెద్దలు కీలక పాత్ర పోషిస్తున్న తరహాలో దేశంలోని వివాద పరిష్కార వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఒక భాగమని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. పరిశ్రమలు వివిధ కారణాలతో వివాదాలను ఎదుర్కొంటున్నాయని, వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని కేసీఆర్ అన్నారు. ఆర్బిట్రేష‌న్ కేంద్రానికి హైద‌రాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు కోసం ప్ర‌స్తుతం 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం కేటాయించామ‌ని, శాశ్వ‌త భ‌వ‌నం కోసం త్వ‌ర‌లో పుప్పాలగూడ‌లో భూమి కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు.