CP Mahesh Bhagwat: పేకాట రాయులకు CP సీరియస్ వార్నింగ్
CP Mahesh Bhagwat: సమాజంలో నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాట ఆడినా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. గత రెండురోజుల్లో కీసర, రామన్నపేట పీఎస్‌ల పరిధిలో పేకాటాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నిషేధిత మరియు చట్టవిరుద్ధమైన ఆటల కార్యకలాపాలను గమనించినట్లయితే పోలీసులకు తెలియజేయాలని భగవత్ ప్రజలకు సూచించారు.
CP Mahesh Bhagwat: సమాజంలో నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాటను అరికట్టాలనే లక్ష్యంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాడులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. సమాజంలో నిషేధిత ఆటలను నిర్మూలించేందుకు పోలీస్ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
గేమింగ్ యాక్ట్ కింద అనేక కేసులు నమోదయ్యాయని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ వ్యసనాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్లపైకి తేవొద్దని సూచించారు. సమాజంలో జరిగే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారని, తప్పు చేసిన వారిని రాష్ట్ర చట్టం ప్రకారం శిక్షిస్తామని సీపీ పునరుద్ఘాటించారు. నిషేధిత ఆటల వైపు మొగ్గు చూపకుండా పౌరులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
గత రెండురోజుల్లో రామన్నపేట, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాటాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దుబ్బాక గ్రామంలో నిర్వహించిన సోదాల్లో రామన్నపేట గ్రామానికి చెందిన గొరిగె సైదులు, ఆముద వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు పేక ఆడుతూ జూదం ఆడుతూ దొరికిపోయారు. ఈ నిందితుల నుంచి రూ.3,250 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో పొలంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.44,790 నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో నిషేధిత ఆటల నిర్మూలనకు 24 గంటలూ పని చేస్తున్న తమ బృందాన్ని సీపీ అభినందించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నిషేధిత మరియు చట్టవిరుద్ధమైన ఆటల కార్యకలాపాలను గమనించినట్లయితే పోలీసులకు తెలియజేయాలని భగవత్ ప్రజలకు సూచించారు. రహస్యంగా జూదం, బెట్టింగ్, పేకాట నిర్వహిస్తే డయల్ 100, రాచకొండ పోలీస్ వాట్సాప్ 9490617111కు సమాచారమివ్వాలని కోరారు.