అత్యవసరం అయితేనే బయటకు రండి...: తెలంగాణ ప్రజలకు డిజిపి హెచ్చరిక
తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ళనుండి బయటకు రావాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు.

హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఇప్పటికయితే కొన్ని ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అదుపులోనే వుందని... ఎవరూ ఆందోళనకు గురికావద్దని డిజిపి అన్నారు. అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లనుండి బయటకు రావద్దని... రాత్రుళ్లు ప్రయాణాలు పెట్టుకోవద్దని డిజిపి సూచించారు.
అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హోంగార్డ్ నుండి డిజి స్థాయి అధికారుల వరకు సిద్దంగా వున్నారని డిజిపి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ప్రతి గంటలకోసారి సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడయినా ప్రమాదకర పరిస్థితులు వుంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు డిజిపి తెలిపారు.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గానే వుందని... కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రం వరదనీటిలో చిక్కుకున్నాయని డిజిపి తెలిపారు. మూసీ నది ప్రవాహం పెరిగిందని... పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుండి ప్రస్తుతానికి రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. బ్రిడ్జి పైకి నీరు చేరితే రాకపోకలు నిలిపివేస్తామని డిజిపి తెలిపారు.
Read More Telangana rains: భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. కొనసాతుతున్న ఐఎండీ రెడ్ అలర్ట్
వర్షాల కారణంగా కొన్నిచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని... హైవే అథారిటీ, ఆర్ ఆండ్ బి అధికారులు వాటిని బాగు చేస్తున్నారని డిజిపి తెలిపారు. గోదావరి నదిలో ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు తెలిపారు. అలాగే ములుగు జిల్లాలోని వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారని డిజిపి తెలిపారు.
చట్టాన్ని కాపాడటమే కాదు ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతను కూడా పోలీసులు తీసుకున్నారని అంజనీ కుమార్ పేర్కొన్నారు. వరద నీటిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదన్నారు. కాబట్టి ఎలాంటి ప్రమాదం చుట్టుముట్టినా వెంటనే డయల్ 100 కు గానీ, స్థానిక పోలీస్ స్టేషన్ కు గానీ ఫోన్ చేయాలని డిజిపి సూచించారు. పోలీసులు 24గంటలు ప్రజలకు అందుబాటులో వుంటారన్నారు.