తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలు సర్వం సిద్ధమయ్యారు. మరి కొంత కాలంలో ఎన్నికలు జరగనుండగా.. ఒక పార్టీలో టికెట్ ఆశించి.. దక్కని అసంతృప్తులంతా మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు.  కాగా.. ఈ వచ్చే ఎన్నికల్లో ఓ సినీ నిర్మాతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.

గ్రేటర్‌లో అత్యంత కీలకమైన ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున సినీ నిర్మాత డాక్టర్‌ రోహిన్‌రెడ్డిని పోటీలో దింపేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో.. ఈ స్థానాన్ని ఎలాగైన సాధించుకోవాలని కాంగ్రెస్‌ గట్టి పట్టుదలతో ఉంది.

ఇదిలా ఉండగా.. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ బందువు ఒకరు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బండారు దత్తాత్రేయకు తోడల్లుడైన రాంనగర్‌కు చెందిన సత్యనారాయణ కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్‌.ప్రదీప్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టికెట్‌ కోసం పార్టీకి దరఖాస్తును అందజేశారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని దత్తాత్రేయతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
 
వచ్చే ఎన్నికల్లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని, ఈ అంశంపై బీజేపీలో చర్చ కూడా సాగుతున్నట్లు తెలిసింది.