శ్రీశైలం: శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల నుండి సీఐడీ బృందం మంగళవారం నాడు కీలక సమాచారాన్ని సేకరించింది.

బ్యాటరీలు పాడయ్యే వరకు ఎందుకు ఉపేక్షించారని సీఐడీ ప్రశ్నించింది. 220 కేవీ డీసీ విద్యుత్ సరఫరాకు బిగించే బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్టుగా సీఐడీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

అయితే అర్ధరాత్రి పూట బ్యాటరీలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, బ్యాటరీలు మార్చే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదని సీఐడీ బృందం ప్రశ్నించింది. ప్యానెల్ బోర్డులో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్న ఆరు యూనిట్లు ఉన్నాయి. టర్బైన్లపై ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోయాయా లేవా అనే విషయాన్ని కూడ అధికారులు పరిశీలించనున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఆటోమెటిక్ గా ట్రిప్ కావాలి. కానీ ఎందుకు విద్యుత్ సరఫరా నిలిచిపోలేదనే విషయమై జెన్ కో అంతర్గతంగా కమిటీని ఏర్పాటు చేసింది. మ్యాన్యువల్ గా విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు ఏఈలు మోహన్, సుందర్ నాయక్ లు ప్రయత్నించారు. మరో  వైపు ఈ ప్రమాదంలో కాలిపోయి మిగిలిన వైర్లు, ఇతరత్రాలను సీఐడీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది.