హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్ నగర్‌లో ఓ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులకు రూ.10 కోట్లు టోకరా వేశారు చిట్‌ఫండ్ నిర్వాహకులు. మోసపోయిన బాధితులు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి ప్రశాంత్ నగర్‌లో కేకేఆర్‌ చిట్‌ఫండ్ పేరుతో 15 ఏళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేశాడు. చిట్టీల రూపంలో చాలా మంది ఆ కంపెనీలో డబ్బులు జమ చేసేవారు.

మొదట చిన్నమొత్తాలను చిట్టీల రూపంలో జమ చేసిన ఖాతాదారులు.. కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకంతో మరింత పొగయ్యారు. దాంతో దాదాపు 300 మంది వరకు సుమారు పది కోట్ల వరకు చిట్‌ఫండ్ కంపెనీలో పెట్టారు.

కూతురి పెళ్లి కోసం కొందరు, పిల్లల చదువుల కోసం కొందరు ఈ చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బులు దాచుకున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గత నెల నుంచి కార్యాలయం తెరవకపోవడం సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి నెల రోజులవుతున్నా ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి కనిపించకుండా పోవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు . తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.