గోదావరికి వరద:చింతూరులో వరద నీటిలో పోలవరం నిర్వాసితుల ఆందోళన
గోదావరి నదికి వరద పోటెత్తడంతో తమను కూడా కాంటూరు లెవల్ లో చేర్చి పరిహారం చెల్లించాలని చింతూరు వాసులు వరద నీటిలో నిలబడి ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి వరద నీటిలో ఈ ప్రాంతంలోకి వరద పోటెత్తింది.
చింతూరు: గోదావరి నదికి వరద పోటెత్తడంతో వరద నీటిలో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ప్రతి ఏటా గోదావరి నదిలో ముంపునకు గురయ్యే బదులుగా ఒకేసారి పోలవరం ముంపునకు గురౌతామని వరద నీటిలోనే నిరసనకు దిగారు అల్లూరి జిల్లా చింతూరులో పోలవరం నిర్వాసితులు వరద నీటిలో నిలబడి ఆందోళనకు దిగారు. తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను కూడా కాంటూరులో చేర్చాలని కూడా ముంపు బాధితులు కోరుతున్నారు.
ప్రతి ఏటా గోదావరి ముంపులో ప్రతి ఏటా వరదలో ముంపునకు గురౌతున్నామన్నారు.కాంటూరు 41.15 లెవల్ లెక్కల కింద తమను కూడా నిర్వాసితులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 52.3 అడుగులకు చేరుకుంది.గోదావరి ఉపనది శబరి నది 52 అడుగులకు చేరింది. ఈ రెండు నదులు పొంగడంతో నాలుగు విలీన మండలాల్లోని గ్రామాలు నీటిలో మునిగాయి. కూనవరం, ఏటపాక, వీఆర్ పురం, చింతూరు మండలాల్లో గోదావరి నది పోటెత్తింది. దీంతో 272 గ్రామాలు వరద నీటిలోనే మునిగాయి.
కాంటూరు లెవల్ ప్రకారంగా విలీన మండలాల్లోని 60 గ్రామాల ప్రజలకు మాత్రమే పరిహారం అందిందని ఆందోళనకారులు చెబుతున్నారు.గత మాసంలో విలీన మండలాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పోలవరం ముంపు పరిహారం గురించి బాధితులతో మాట్లాడారు. పోలవరం ముంపు బాధితులకు పరిహారం చెల్లించేందుకు వెంటనే నిధులివ్వాలని ప్రధానిని మరోసారి కోరుతానన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీీ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు గాను కనీసం రూ. 22 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఇంత పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి లేదన్నారు. వెయ్యి లేదా రూ. 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేదని సీఎం చెప్పారు.