హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్, విరసం కార్యదర్శి చింతకింది కాశిం మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. కార్తిక్ పేరుతో అతను ఆ పనులు చేస్తున్నారని వారు చెప్పారు. కాశింపై నిఘా పెట్టి అతని కార్యకలాపాలను గుర్తించినట్లు తెలిపారు. 

కాశింను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కాశింపై పెట్టిన కేసులను ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వెల్ సహాయ పోలీసు కమిషనర్ పి. నారాయణ కౌంటర్ దాఖలు చేశారు. నిషేదిత మావోయిస్టుల భావజాల వ్యాప్తికి కాశిం ప్రొఫెసర్, జర్నలిస్టు ముసుగు వేసుకున్నారని ఆయన ఆరోపించారు.

also Read: మవోయిస్టు అగ్రనేతలతో కాశీంకు లింక్స్: భార్యపైనా కేసు

ప్రొఫెసర్ గా పనిచేస్తూ విద్యార్తుల్లో మావోయిస్టు భావజాలాన్ని నింపి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బలమైన ఆధారాలు ఉన్నందువల్లనే కాశింను అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతా చట్ట ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. 

మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే స్స్థల్లో కాశిం ప్రముఖడని ఆయన చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టుతో కాశింకు సంబంధాలున్నాయని చెప్పారు బలమైన సాక్ష్యాలు ఉన్నందువల్లనే అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

Also Read: ప్రొఫెసర్ కాశీం పరారీలో ఉన్నారా..? పోలీసులకు న్యాయస్థానం అక్షింతలు

కాశిం గళాన్ని నొక్కేయడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక గళాలను తాము అణచివేయడం లేదని, మావోయిస్టుల పేరుతో కాశిం చందాలు వసూలు చేశారని ఆయన చెప్పారు. 2016లో ఉన్న కేసుల్లో అరెస్టు చేయకపోవడం వల్లనే పరారీలో ఉన్నట్లు తెలిపామని ఆయన అన్నారు. కాశిం ఇంట్లో ఆయన భార్య సమక్షంలోనే సోదాలు చేసినట్లు తెలిపారు. సోదాలను వీడియో కూడా తీశామని చెప్పారు. 

తాము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, కంప్యూటర్ వంటివాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. కాశింపై మొత్తం నాలుగు కేసులున్నాయని, మరో రెండు కేసుల్లో నిర్దోషిగా తేలాడని ఆయన చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులతో కార్తిక్ అనే పేరుతో కాశిం సంప్రదింపులు జరుపుతున్నాడని ఆయన చెప్పారు 

2018లో శ్యాం సుందర్ రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయని ఆయన చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురు కాశిం భార్య స్నేహలత అని చెప్పారు. శ్యాంసుందర్ రెడ్డి మావోయిస్టు నేత చంద్రన్న అలియాస్ ఆత్రంకు కొరియర్ గా పనిచేసేవాడని, అతని ద్వారా తెలిసిన వివరాలతో కాశింపై నిఘా పెట్టామని చెప్పారు.