టిడిపి రావుల కోసం నా సీటు త్యాగం చేస్తా

టిడిపి రావుల కోసం నా సీటు త్యాగం చేస్తా

జిల్లెల చిన్నారెడ్డి.. రావుల చంద్రశేఖరరెడ్డి ఈ ఇద్దరు లీడర్ల పేర్లు వినగానే వనపర్తి నియోజకవర్గం పులకించిపోతది. ఈ ఇద్దరూ ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. క్లాస్ మెట్స్ కూడా. కానీ రాజకీయాల్లో మాత్రమే ప్రత్యర్థులుగా ఉన్నారు. వీరిద్దరూ చదువుకునే రోజుల్లో స్నేహితులుగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా మారారు. కానీ ఏనాడూ శత్రువులు మాత్రం కాలేదు. ఒకసారి ఒకరు గెలిస్తే.. ఇంకోసారి ఇంకొకరు గెలిచారు. ఇద్దరూ నిఖార్సైన ప్రొఫెషనల్ పొలిటీషియన్లే. ఇద్దరి వృత్తి.. ప్రవృత్తి కూడా రాజకీయమే. ఇద్దరికీ వ్యాపారాలు లేవు. చీకటి వ్యవహారాలు అసలే లేవు. అడ్డగోలు సంపాదనకు ఏనాడూ ఆశపడినట్లు చరిత్రలో లేదు. ఇదంతా వనపర్తి జనాలు చెప్పుకుంటున్న మాటలు.

రాజకీయ ప్రసంగాల్లో సైతం ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ కనీసం పేరు తీసుకొని కూడా విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవని చెబుతారు. ఈ ఇద్దరు లీడర్ల కారణంగానే వనపర్తి నియోజకవర్గం రాజకీయ కక్ష్యలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉందని చెబుతారు. వనపర్తిలో వీరిద్దరూ దశాబ్దాల కాలంగా రాజకీయాలు నడుపుతున్న కారణంగా పెద్దగా రాజకీయ ఉద్రిక్తతలు ఏనాడూ చోటు చేసుకోలేదు.

కానీ ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు కలిసిపోయే సమయం వచ్చింది. కాంగ్రెస్ నేతగా ఉన్న చిన్నారెడ్డి స్నేహహస్తం అందించారు. రావులను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రావుల వస్తే.. అవసరమైతే తన సీటు కూడా రావులకు ఇవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని ప్రకటించారు. మాజీ మంత్రి, వనపర్తి శాసనసభ్యులు చిన్నారెడ్డి ఇవాళ సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. రావుల చంద్రశేఖరరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది కాబట్టే రావులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాని చెప్పారు. తన కంటే రావుల బలమైన అభ్యర్థి అని భావిస్తే తన సీటును త్యాగం చేసేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. రావుల కాంగ్రెస్ లోకి వస్తే దేవరకద్రలో కాంగ్రెస్ తరుపున పోటీ చేయవచ్చన్నారు. అక్కడ కాంగ్రెస్ నేత పవన్ కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతారని జోస్యం చెప్పారు.

ఇక బిజెపి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారనే వార్తలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు చిన్నారెడ్డి. పాలమూరు జిల్లాలో నాగం బలమైన నాయకుడు అని చెప్పారు. ఆయన రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభావం చూపగిలిన నాయకుడు అన్నారు. నాగం లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్ లోకి రావాలని ఆకాంక్షించారు. బలమైన నాయకులు ఎవరు పార్టీ లోకి వస్తానన్నా ఆహ్వానించాల్సిందే అన్నారు. నాగం, జైపాల్ రెడ్డిలపై పై ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎమ్మెల్సీ గా దామోదర్ రెడ్డి గెలుపు కోసం నాగం కూడా సహకరించిన విషయాన్ని దామోదర్ రెడ్డి మర్చిపోవద్దన్నారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page