హరితహారం కరీంనగర్ చిన్నారులకు కష్టాలను మిగిల్చింది.  నాయకులు ఎసి కార్లలో వచ్చి మొక్క నాటి వెళ్లిపోయారు. బడి పిల్లలు మాత్రం గంటల తరబడి ఎండలో మాడిపోయారు. చిన్నారులను రోడ్ల మీద కుసబెట్టడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.

హరితహారం అనగానే గన గన గంట కొట్టినట్లు చెబుతారు మన నాయకులు, అధికారులు. తెలంగాణ అంతటా 230 కోట్ల మొక్కలు నాటుడు అని, మూడో దశ హరితహారం అని, ఆకుపచ్చ తెలంగాణ ద్వారా బంగారు తెలంగాణ అని ఇలా రకరకాల పంచ్ డైలాగులు చెబుతారు. కానీ హరితహారం అంటే పసి పిల్లల కష్టాలు అని, రోడ్ల మీద గంటల తరబడి తిండి తిప్పలు మాని కుసునుడు అని ఎవరూ చెప్పరు. కారణం అధికారులు నాయకులు చెప్పేవి వెలుగు జిలుగులు కానీ పిల్లలవి మాత్రం తెరచాటు చీకటి కష్టాలు.

తెలంగాణ సిఎం కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఏ అధికారి చూసినా, ఏ నాయకుడు చూసినా హరితహారం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అధికార నాయకగణం చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. అధికారయంత్రాంగం యావత్తూ హరితహారంలో తరించిపోతున్నది.

ఇక కరీంనగర్ లో సిఎం కెసిఆర్ హరితహారంలో పాల్గొన్నారు. ఆయన ఒక మొక్క నాటారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. కానీ ఆ కార్యక్రమం లక్ష మందితో చేపట్టాలని ప్లాన్ చేశారు ప్రభుత్వ పెద్దలు. లక్ష మంది వస్తరో రారో అని అనుకున్నరో ఏమో చివరికి బడి పిల్లలను సైతం వదలకుండా తీసుకొచ్చి రోడ్ల మీద కుసోబెట్టిర్రు.

నాయకులేమో ఏసీ కార్లలో వచ్చి ఒక మొక్క నాటి ఫోటోలకు పొజిచ్చి తమ జాగాల తాము వెళ్లిపోయిర్రు. కానీ పసి పిల్లలు మాత్రం గంటల తరబడి ఎండలో వేచి ఉండడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పిల్లలకు ఇంత పెద్ద శిక్ష అవసరమా? ఇదేమి అన్యాయం అంటూ వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు మెదక్ కలెక్టర్ ఏమో పిల్లలను బడినుంచి బయటకు తీసుకుపోతే హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కార్యక్రమం కరీంనగర్ లో జరిగింది కాబట్టి సరిపోయింది. అదే మెదక్ లో జరిగితే కలెక్టర్ ఎంత మంది హెడ్మాస్టర్లను సస్పెండ్ చేసేవారో మరి.