Hakimpet Sports School: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం(BHSS) రాష్ట్ర అధ్యక్షులు డా గుండు కిష్ఠయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ డిమాండ్ చేశారు.

Hakimpet Sports School: హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆ చిన్నారిని ఓ కీచక అధికారి నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ కీచక అధికారి బాలికల గదుల్లోకి అక్రమంగా చొరబడుతున్నాడు.

ఈ క్రమంలో ఆ కీచకుడి దారుణాలు తీవ్రం అయ్యాయి. ఓ బాలికపై ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు పాల్పడ్డాడు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఆ అధికారిపై ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు. ఉన్నతాధికారుల అండ ఉండటంతో కీచకుడి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. 

ఈ దారుణంపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఈ తరుణంలో బాలల హక్కుల సంక్షేమ సంఘం(BHSS) ఆగ్రహం వ్యక్తం చేసింది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో బాలికల పై లైంగిక వేధింపుల కు గురి చేసిన అధికారిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం(BHSS) రాష్ట్ర అధ్యక్షులు డా గుండు కిష్ఠయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ డిమాండ్ చేశారు.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తీవ్రమవుతున్నాయనీ, వీటిని అరికట్టడానికి ప్రతి పాఠశాలలో CC కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర మహిళా కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీలు, షీ టీమ్స్ ఈ మూడు శాఖల సమన్వయంతో రెగ్యులర్ గా బాలికలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ మేరకు ప్రభుత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరారు. ప్రతి రెండు నెలలకోసారి అన్ని ప్రభుత్వ ప్రయివేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్స్ స్కూల్స్, బాలికల ఉన్నత పాఠశాలలు సందర్శించాలనీ, ఆ స్కూల్స్ లో బాలికల స్థితిగతులపై విచారణ జరపాలని సూచించారు.

బాలికల అభిప్రాయాలను సేకరించాలని , తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికల భద్రతకు భరోసాను కల్పించాలని అన్నారు. బాలికలను లైంగిక వేధింపులపై విచారణ జరిపి, పాల్పడే వారిని జువైనల్ జస్టిస్ ఆక్ట్ - 2015 ప్రకారం కఠినంగా శిక్షించాలని, బాలికలకు భరోసా కల్పించాలని కోరారు.