పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హత్యలో పోలీసుల అధికారుల పాత్రపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పోలీసులపై ప్రధాన సెక్షన్ల కింద అభియోగాలు ఎందుకు మోపలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో పోలీసులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని .. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.

తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, పోలీసులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అనంతరం తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు నిందితుడు రాకేశ్ రెడ్డి. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసులో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 పేజీల చార్జి షీట్‌ను బంజార హిల్స్ పోలీసులు దాఖలు చేశారు.

చార్జిషీట్‌లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా రాకేష్ రెడ్డి, ఏ2గా విశాల్‌నే చేర్చారు. ఈ కేసులో మొత్తం 73 మందిని సాక్షులుగా చేర్చిన పోలీసులు.. 12వ సాక్షిగా శిఖా చౌదరి ఉన్నారు.