తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్.. భారీగా నష్టపోతున్న డిస్కంలు.. ఆ వివాదాలే కారణం..!
తెలంగాణకు పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి.

తెలంగాణకు పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి. వివరాలు.. తెలంగాణ డిస్కంలు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ(సీఎస్‌పీడీసీఎల్) మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా 2020–21లో దాదాపు 40 శాతం, 2021–22లో 19శాతం విద్యుత్ మాత్రమే ఛత్తీస్‌గఢ్ సరఫరా చేసింది. అయితే 2022–23లో పూర్తిగా నిలిపేసింది. 2022–23 ఆర్థిక సంత్సరంలో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ సరఫరా చేయలేదు.
అయితే ఇందుకు కారణంగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలను పెంచేయడం, అందుకు తగ్గట్టుకు బకాయిలను చెల్లించాలని కోరడం ఒక కారణంగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ డిస్కంలు మాత్రం తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్ విద్యుత్‌కు రూ.3.90 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. 2022 జూన్ 3 నాటికి బకాయిపడిన రూ.3,576.89 కోట్లు చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ చెబుతుండగా.. తాము రూ. 2,100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. బకాయిలు చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని ఛత్తీస్‌గడ్ స్పష్టంగా చెబుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు, సీఎస్‌పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్‌లో ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆ సమయంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ప్రభుత్వం అలాంటిదేమి లేదని విమర్శలను తిప్పికొట్టింది. ఇక, ఛత్తీస్‌గఢ్‌తో కుదిరిన ఒప్పందానికి కొన్ని మార్పులతో అనుమతిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి 2017 మార్చిలో మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తన మధ్యంతర ఉత్తర్వుల్లో.. “ఛత్తీస్‌గఢ్ ఈఆర్‌సీ ఆమోదించే టారిఫ్ తుది ఉత్వర్వు వరకు.. ఛత్తీస్‌గఢ్ డిస్కమ్ నుంచి తెలంగాణ డిస్కమ్‌కు విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించిన తాత్కాలిక టారిఫ్‌కు మేము మా ఆమోదం/సమ్మతిని తెలియజేస్తున్నాము’’ అని పేర్కొంది.
ఇక, ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులతోపాటు పీపీఏ తుది అనుమతులను తెలంగాణ డిస్కంలు సవాల్ చేశాయి. ఈ మేరకు తెలంగాణ డిస్కంలు 2018లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్)లో కేసు వేశాయి.
మరోవైపు వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టెల్ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను.. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్‌గఢ్‌కు తెలిపాయి. అయితే ఈ ప్రతిపాదనకు ఛత్తీస్‌గఢ్ అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే 2022–23 ఆర్థిక సంత్సరంలో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా తెలంగాణకు సరఫరా చేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. లోటును పూడ్చుకునేందుకు బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో తాము భారీగా నష్టపోతున్నామని డిస్కంలు.. ఈఆర్సీకి తెలిపాయి. ఈ వివాదాలు సద్దుమణిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి దాదాపు 2,500 మిలియన్ విద్యుత్ సరఫరా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.