చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలంలోని తంగేడుపల్లి వంతెన కింద నగ్నంగా పడి ఉన్న మహిళ శవం కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మహిళ మహారాష్ట్రకు గానీ గుజరాత్ రాష్ట్రానికి గానీ చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను అందించారు. 

మెడకు ఉరేసి, తర్వాత తలపై కొట్టి మహిళను చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. చేతులు కట్టేసిన ఆనవాళ్లను కూడా వైద్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. వివాహేతర సంబంధం లేదా కుటుంబ కలహాలు హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Also Read: మరో దిశ: యువతి ముఖంపై బండరాయితో మోది... గుర్తు పట్టనంతగా..

చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఫాంహౌస్ లు, రిసార్టులు ఉండడంతో మహిళపై అత్యాచారం జరిగి ఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంగేడుపల్లి సమీపంలోని వికారాబాద్ కు వెళ్లే మార్గంలో గల కల్వర్టు కింద ఇటీవల దుస్తులు లేకుండా నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. 

మహిళను ఎక్కడో చంపేసి కల్వర్టు కింద పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తంగేడుపల్లి యువకుడు శేరిల్ల నవీన్ ఉదయం ఏడు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా శవాన్ని చూసి సర్పంచ్ భర్తకు సమాచారం అందించాడు. ఆ సమాచారాన్ని పోలీసులు అందుకుని శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. 

మహిళ ముఖం మొత్తం నుజ్జనుజ్జయి ఉంది. దుండగులు బండరాళ్లతో ముఖంపై మోది గుర్తు పట్టరానట్లు చేశారని చెబుతున్నారు. మృతదేహం వద్ద ఓ నైలాన్ తాడు తప్ప మరే ఆధారం కూడా లభించలేదు. మహిళ వివస్త్రగా పడి ఉన్నప్పటికీ సంఘటనా స్థలంలో దుస్తులు కనిపించలేదు. ఆమెను చంపడానికి ఉపయోగించిన ఆయుధాలు కూడా కనిపించలేదు. 

Also read: మరో ‘దిశ’...ఒంటిపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం..

ఎక్కడో చంపేసి నైలాన్ తాడుతో మహిళ మృతదేహాన్ని పైనుంచి కిందికి దింపి, బండరాళ్లతో మోది ఉంటారని అనుమానిస్తున్నారు. పక్కన ఉన్న రాళ్లకు మాత్రం రక్తం మరకలు అంటాయి. మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, వేలికి బంగారు ఉంగరం, మెడలో బంగారు లాకెట్ ఉన్నాయి. సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. దీన్ని బట్టి మహిళను వేరే ప్రాంతంలో చంపి శవాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి పడేశారని భావిస్తున్నారు.