హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేవేళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం గారూ గతంలో మిమ్మల్ని విమర్శిస్తే మన్నించండి కానీ మాకు నీళ్లు ఇవ్వండి అంటూ అర్థించారు. 

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కోసం కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నేతల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మెయినాబాద్ శంకర్ పల్లిలో వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

సాగునీటి కోసం పాదయాత్ర చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకుని అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. కేసీఆర్ తన సొంత ప్రాంతంలో ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని తాము కూడా తెలంగాణలో ఉన్నాం అని గుర్తు చేశారు. 

రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే ఉందని తమకు సాగునీరు ఇవ్వాలని కోరారు. లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి రత్నాల సీమను చేస్తానంటున్న కేసీఆర్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ప్రజలను ఎందుకు మర్చిపోతున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందడం లేదని, రైతు బంధు ఇంకా అందక రైతులు చాలా బాధపడుతున్నారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.