ఇప్పటికే వరుసగా పార్టీ ఎమ్మెల్యేల  వలసలతో సతమమతమవుతున్న కాంగ్రెస్ లో మరో సమస్య మొదలయ్యింది. ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడగా కొద్దిరోజులగా పార్టీ సీనియర్లు,  మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా వారి బాటలోనే చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం నడుస్తున్నారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. 

ఈ సందర్భంగా రత్నం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమారక్ రెడ్డికి ఓ లేఖ రాశారు.  గత ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ లో చేరిన తనకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు ఉత్తమ్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే  వ్యక్తిగత కారణాలతోనే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానని...కావున ఆమోదించాల్సిందిగా రత్నం ఉత్తమ్ ను కోరారు. 

2014 ఎన్నికలకు ముందు రంగారెడ్డి సీనియర్ టిడిపి నాయకులు పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కేఎస్ రత్నం టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో  చేవేళ్ల నుండి  రత్నం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కాలే యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలొ యాదయ్య టీఆర్ఎస్ లో చేరారు. 

అయితే 2018 లో టీఆర్ఎస్ పార్టీ నుండి తనకు టికెట్ వస్తుందిన ఆశించిన రత్నం కు నిరాశే ఎదురయ్యింది. మళ్లీ సిట్టింగ్ లకే టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో యాదయ్య చేవెళ్ల అభ్యర్థిగా పోటీలో నిలిచారు. దీంతో రత్నం ఎన్నికలకు ముందు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరోసారి యాదయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇలా కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆ పార్టీని వీడి సొంతగూటికి చేరే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో చెవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం రత్నంను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అందుకోసమే అతడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.