తెలంగాణ రాగానే ఒక్క దెబ్బకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒక్కటే దెబ్బల లక్ష కుటుంబాలు సెటిల్ అయిపోతాయి అని ఉద్యమ నేతగా ఉన్న సమయంలో తెలంగాణ రాకముందు కేసిఆర్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ ప్రకటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా. మరి తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణలో కేసిఆర్ సిఎం కుర్చీ ఎక్కిండు. కానీ ఒక్క దెబ్బకు లక్ష ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. ఒక్క దెబ్బకేం ఖర్మ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నా లక్ష ఉద్యోగాలు భర్తీ కాలేదు.

అదే ముచ్చటను మరోసారి గుర్తు చేశారు తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్.

సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో బంగారు తెలంగాణలో ఉద్యోగాలు రావటం లేదని ఆవేదనతో అత్మహత్య చేసుకున్న నెర్సు వెంకటరమణ కుటుంబాన్ని డాక్టర్ చెరుకు సుధాకర్ పరామర్శించారు. వెంకటరమణ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు ఎందుకు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేకపోతున్నారు అని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నిరుద్యోగ భృతి అయిన ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70% మంది పేద మధ్యతరగతి వారే అని మీకు తెల్వదా? అని నిలదీశారు. ఇప్పటికైనా ఒక్కసారి సమాలోచన చెయ్యండి అని కోరారు. అకడమిక్ ఎంప్లాయ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు. యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. నిరుత్సాహం తో ఆత్మహత్యలు చేస్కొని తెలంగాణ తల్లికి గర్భశోకం మిగల్చకండి అని విన్నవించారు. అందరం కలిసి హక్కులు, ఉద్యోగాల కోసం కలిసిగట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.