హైదరాబాద్: మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం నాడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు.

also read:సుజాతకే టీఆర్ఎస్ టికెట్: అసంతృప్తి నేత చెరుకు శ్రీనివాస రెడ్డి కీలక భేటీ

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకత్వం సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టిక్కెట్టును ప్రకటించింది.

దీంతో సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ కేటాయించడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తన అనుచరులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుండే శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్టు కోసం శ్రీనివాస్ రెడ్డి చివరి నిమిషం కోసం ప్రయత్నించారు.

కానీ సీఎం కేసీఆర్ రామలింగారెడ్డి భార్య సుజాత వైపుకు మొగ్గు చూపారు. 2019 ఎన్నికలకు ముందు చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డికి ఆయన మద్దతిచ్చారు.

అనారోగ్య కారణాలతో చెరుకు ముత్యంరెడ్డి మరణించారు. సోలిపేట రామలింగారెడ్డి కూడ అనారోగ్య కారణాలతో చనిపోయాడు. శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. కానీ, పోటీకే శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

కొన్ని రోజుల క్రితం చెరుకు శ్రీనివాస్ రెడ్డి  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహాతో సమావేశమయ్యారు. కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దుబ్బాక నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించనుంది.