మెదక్: నవంబర్ 3వ తేదీన జరిగే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  టిక్కెట్టు కోసం చివరి నిమిషం కోసం ప్రయత్నించిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీవివాస్ రెడ్డి తన అనుచరులతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టు 5వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను సీఎం కేసీఆర్ అభ్యర్ధిగా ప్రకటించారు. సోమవారం నాడు రాత్రి దుబ్బాకకు చెందిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.

రామలింగారెడ్డి సతీమణికి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కడంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం.ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. తన తండ్రి  ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత కొందరు అసమ్మతి నేతలు కూడ సమావేశాలు నిర్వహించడం కూడ టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. అసమ్మతి నేతలను మంత్రి హరీష్ రావు బుజ్జగించారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం నాడు తన అనుచరులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది.