నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి పడింది.ఈ విషయమై స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

అజలాపురం గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుందని  స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ అటవీశాఖాధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే  ఈ ప్రాంతంలో అడవి పందుల సంచారం కూడ ఎక్కువే. రాత్రి పూట అడవి పందులు పంట పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుంటాయి. అయితే అడవి పందుల కోసం స్థానిక రైతులు ఉచ్చులు వేశారు.  బుధవారం నాడు ఉదయం అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఓ చిరుతపులి చిక్కింది.

ఉదయాన్ని పొలానికి వచ్చిన రైతు ఈ విషయాన్ని గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు చిరుత పులిని చూసేందుకు అక్కడికి చేరుకొన్నారు. అంతేకాదు సమాచారాన్ని అటవీశాఖాధికారులకు చేరవేశారు.

అటవీశాఖాధికారులు కూడ అజలాపురం గ్రామానికి చేరుకొన్నారు. అజలాపురం గ్రామంలో  ఉచ్చులో ఉన్న చిరుతపులికి మత్తు మందు ఇచ్చి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.