Asianet News TeluguAsianet News Telugu

అప్పుల వాళ్లను తప్పించుకోవడానికి చనిపోయినట్లు నాటకం

అప్పుల వాళ్లను తప్పించుకోవడానికి చనిపోయినట్లు నాటకం

cheating case file in hyderabad

అప్పుల  వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఉండి లేరు అనిపిస్తారు కొందరు.. ఇంకొందరు అడ్రస్ మార్చుకోవడమో.. లేదంటే ఫోన్లు స్విచ్చాఫ్ చేయడమో చేస్తారు.. అవన్నీ పాత ఐడియాలను అనుకున్నాడో ఏమో ఏకంగా చనిపోయినట్లు నాటకమాడి అడ్డంగా బుక్కయిపోయాడు ఓ వ్యక్తి.. కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు..

స్టాక్ మార్కెట్, షేర్లు, పెట్టుబడులపై అవగాహన ఉండటంతో తన సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలు పోస్ట్ చేస్తూ ఉండేవాడు.. అలా చాలా మంది అతని సలహాలు పాటించి షేర్ మార్కెట్‌లో మంచి లాభాలను ఆర్జించేవారు. ఈ క్రమంలో మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి ఇతనికి డబ్బులు ఇచ్చి మరి సలహాలు పొందేవాడు. అయితే తను చేసే ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో సునీల్ కుమార్ రెడ్డి ఓ  ప్లాన్ వేశాడు.. తన దగ్గర సలహాలు పొందుతున్న వారిని మోసం చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని భావించాడు.

ప్లాన్ లో భాగంగా తన వద్ద పెట్టుబడి పెడితే షేర్ మార్కెట్ లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆదాయాన్ని ఇస్తానని చెప్పాడు. దీంతో మాదాపూర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి రూ.6 లక్షలు ఆయన ఖాతాలో వేశాడు. మరికొంత మంది కూడా డబ్బులు చెల్లించారు. అలా మొత్తం రూ.10 లక్షలు జమ కావడంతో ప్లాన్ వర్కవుట్ అయ్యిందని భావించి వాటిని ఎగ్గొట్టడానికి కొత్త స్కెచ్ గీశాడు..

బైక్‌పై వెళుతుండగా సునీల్ కుమార్ రెడ్డి అతని భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారని.. సునీల్ మరణించగా.. అతడి భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఆమెను బతికించేందుకు తలో చెయ్యి వేయాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిని పసిగట్టిన సదరు ఐటీ ఉద్యోగి  సబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు జగద్గరిగుట్టలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని.. సునీల్  కుమార్ రెడ్డి నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios