ఆసరా పెన్షన్ల పథకంలో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అధికారుల విచారణలో చార్మినార్ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో ఆ ప్రాంత ఎమ్మార్వోగా ఉన్న జుబేదాపై వేటు వేసింది.  

ఆ ప్రాంతంలో 350 ఆసరా పెన్షన్లు పక్కదారి పట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఆరుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి సిబ్బంది సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కొందరు సిబ్బంది. మరీ ముఖ్యంగా నకిలీ లబ్ధిదారులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు.

భర్త ఉన్నవారిని వితంతు పెన్షన్ లబ్ధిదారులుగా చేర్చడంతో పాటు మూడు బంగ్లాలున్న వారిని కూడా లబ్ధిదారులుగా చేర్చారు. తమకు పెన్షన్ రాకపోవడంతో కొందరు లబ్ధిదారులు మే నెలలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.