Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు: పలువురికి గాయాలు


హైద్రాబాద్  నాంపల్లి రైల్వే  స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

Charminar express train Derailed at Nampally Railway station in Hyderabad lns
Author
First Published Jan 10, 2024, 9:38 AM IST


హైదరాబాద్: హైద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.  రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను  రైలు  ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  రైలులోని  10 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి.  

ఫ్లాట్ ఫారమ్ సైడ్ వాల్ ను  రైలు ఢీకొనడంతో  మూడు బోగీలు  పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో  రైల్వేస్టేషన్ లోని ప్రయాణీకులు భయంతో పరుగులు పెట్టారు.  రైల్వే స్టేషన్ లోనే  చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు  పట్టాలు  తప్పింది 

 నాంపల్లి రైల్వే స్టేషన్ లో  రైలు ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో  రైలు వేగంగా ఉంటే  పెద్ద ప్రమాదం జరిగేదని  రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై  రైల్వే అధికారులు  ఆరా తీస్తున్నారు. చెన్నై నుండి హైద్రాబాద్ కు  చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది.  హైద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లోకి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంతో  చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఎస్-2, ఎస్-3, ఎస్-6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

నాంపల్లి రైల్వే స్టేషన్ లో నిర్ధేశిత  ప్రాంతంలో  రైలు ఆగాల్సిన ప్రాంతంలో కాకుండా రెండు లేదా మూడు అడుగులు ముందుకు వెళ్లి సైడ్ వెళ్లి  సైడ్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో  రైలు  కుదుపులకు గురైంది.  అంతేకాదు రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.  దీంతో  రైలులో ఫుట్ బోర్డు చేస్తున్న ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. రైలు నిర్ధేశించిన స్థలంలో కాకుండా ముందుకు ఎందుకు వెళ్లిందనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రయాణీకులంతా క్షేమం: దక్షిణ మధ్య రైల్వే

చార్మినార్  ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో  ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని  దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.  రైలు ప్రమాదానికి గురయ్యే సమయానికి  ప్రయాణీకులు దాదాపుగా రైలును దిగినట్టుగా  రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారని  రైల్వే అధికారులు ప్రకటించారు. చెన్నై నుండి వచ్చే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో  ఆరుగురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారని  దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ప్రకటించారు.  ఈ ప్రమాదంలో  గాయపడిన ప్రయాణీకులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదానికి కారణాలు  విచారణలో తేలుతాయన్నారు. ఈ ప్రమాదంతో  రైళ్ల మార్పులు, చేర్పుల గురించి సమాచారం ఉంటే  తెలుపుతామన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios