కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆయన భద్రాచలం వెళ్ళాల్సి వుండగా.. అనివార్య కారణాలతో అది రద్దయ్యింది.
కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం రేపటి భద్రాచలం కార్యక్రమం రద్దయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాములను అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం హెలికాఫ్టర్‌లో ఖమ్మంకు చేరుకోవాల్సి వుంది.
అయితే అనివార్య కారణాల వల్ల ఆయన నేరుగా ఖమ్మం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ఖమ్మం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ వెళతారు అమిత్ షా.
ALso Read: అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. వివరాలివే
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించి విపక్షాలను డిఫెన్స్‌లో పడేశారు సీఎం కేసీఆర్. అటు కాంగ్రెస్ కూడా టికెట్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. త్వరలోనే హస్తం పార్టీ నుంచి అభ్యర్ధుల జాబితా విడుదలయ్యే అవకాశం వుంది. కానీ బీజేపీలో మాత్రం ఎలాంటి ఊపు లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో అమిత్ షా పర్యటన కేడర్‌లో జోష్ తీసుకొస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోంమంత్రి ఎలాంటి విమర్శలు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
