తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది.
తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ ఎంట్రన్స్, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 12 నుంచి 14 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. అలాగే మే 10 , 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను కూడా యధాతథంగా నిర్వహిస్తామని చెప్పింది.
ఇదిలావుండగా.. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. అయితే లేటు ఫీజుతో మే 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. గురువారం సాయంత్రం నాటికి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,14,989 మంది.. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 65,033 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
