అనారోగ్య సమస్యలతో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇబ్బంది పడుతున్నారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు నాయుడు  రాజమండ్రి జైలులో  52 రోజుల పాటు  ఉన్నారు. జైలులో ఉన్న సమయంలో చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి.  


హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు హైద్రాబాద్ లోని ఎఐజీ ఆసుపత్రిలో గురువారంనాడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.ఇవాళ ఉదయం చంద్రబాబును వైద్యుల బృందం ఇంటి వద్ద పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైన పరీక్షల కోసం ఆసుపత్రికి రావాలని సూచించింది. దీంతో ఇవాళ ఉదయం చంద్రబాబునాయుడు ఎఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబునాయుడు ఆసుపత్రికి రావడానికి గంట ముందే నారా లోకేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబుకు నిర్వహించాల్సిన పరీక్షల గురించి లోకేష్ తెలుసుకున్నారు. ఈ విషయమై వైద్యులతో చర్చించారు.

ఫిస్టుల్లా సమస్య ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు వైద్యులకు చెప్పినట్టుగా సమాచారం. ఈ విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ వస్తున్న విషయాన్ని చంద్రబాబు వైద్యులకు చెప్పారు. 2డీ ఈకో, ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల తర్వాత ఆసుపత్రిలో ఇన్ పెషేంట్ గా ఆడ్మిట్ కావాలా... లేదా అవుట్ పేషెంట్ గా ట్రీట్ మెంట్ తీసుకోవాలా అనే విషయమై వైద్యులు ఓ స్పష్టత ఇవ్వనున్నారు. 

లివర్, కిడ్నీల పనితీరును కూడ వైద్యులు కూడ పరీక్షించనున్నారు. మరో వైపు చంద్రబాబు చర్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో చర్మ సంబంధమైన సమస్యలపై చంద్రబాబు పరీక్షలు చేయించుకొంటారు. 

చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం రావడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చే వారిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఆసుపత్రికి కొద్దిదూరంలోనే బారికేడ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పోలీసులు చెక్ చేస్తున్నారు. 

also read:చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఇవే...!

ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు పూర్తైన తర్వాత చంద్రబాబునాయుడు ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకుంటారు. ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుంటారు. ఈ ఏడాది జూన్ మాసంలో చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఎల్ వీ ప్రసాద్ ఆసుపత్రికి కూడ చంద్రబాబు వెళ్లనున్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెండు రోజుల క్రితం చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యారు. నిన్న సాయంత్రం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు చేరుకున్నారు.