దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కరోనా పాజిటివ్ గా తేలింది.

ఆదివారం సీఎం కేసీఆర్ కి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా వచ్చినట్లు తేలింది. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని.. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు తెలిపారు. యాంటిజెన్ టెస్టు చేయగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా.. కేసీఆర్ కి కరోనా రావడం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్.. ఈ కరోనా మహహ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆంకాంక్షించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.