Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో చంద్రబాబు కొత్త స్టయిల్ స్పీచ్

ఏం మాట్లాడారో తెలుసా ?

Chandrababu tone changed in Telangana TDP Mahanadu

దేశంలో ఉన్న సీనియర్ నేతల్లో తానే నెంబర్ 1 స్థానంలో ఉన్నానని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ మహానాడులో ఆయన ప్రసంగించారు. దేశంలో 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న తానే అందరికంటే సీనియర్ ను అని ప్రకటించారు.

కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి బిజెపికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఆంధ్రాలో అవినీతి పార్టీని బిజెపి వాళ్లు అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. దేశంలో నేషనల్ ఫ్రంట్ ప్రారంభించిందే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

తనకు ప్రధానమంత్రి కావాలన్న ఆశ ఏమాత్రం లేదని మరోసారి బాబు వెల్లడించారు. 1996లోనే తనకు అవకాశం వచ్చినా తిసర్కరించానని చెప్పారు. రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తాను దూరంగా ఉన్నానని చెప్పారు. తెలుగు జాతిని అభివృద్ధి చేయడం కోసమే తాను ప్రధాని అవకాశాన్ని కాదనుకున్నట్లు చెప్పారు.

తెలుగు జాతి ఉన్నతి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. తెలంగాణలో మళ్లీ టిడిపికి మంచిరోజులు వస్తాయన్నారు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు తప్ప కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తనకు ప్రాణ సమానులైన కార్యకర్తలు టిడిపిలోనే ఉన్నారని వెల్లడించారు.

పార్టీలో ఉన్న కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో 19 సభలు జరిపి సత్తా చాటారని అన్నారు. ఒక్కో కార్యకర్త వంద మంది కార్యకర్తలను తయారు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

హైదరాబాద్ లో భూములు అన్యాక్రాంతం కాకుండా పోరాటం చేసిన చరిత్ర మనకు ఉందన్నారు. అవినీతిని ఎండగట్టామన్నారు. హైదరాబాద్ లో అందమైన ఎయిర్ పోర్టు కట్టించానని చెప్పారు. హైటెక్ సిటీ కట్టించానని అన్నారు. హైటెక్ సిటీ ఎవరికి కావాలి అంటూ ఆ రోజుల్లో హేళన చేశారని గుర్తు చేశారు.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు హైదరాబాద్ అటు అమరావతి తెలుగు నగరాలే దేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. కార్యకర్తల గుండెబలం ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మీరు మీటింగ్ లో నుంచి కదలకుండా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

కుమారస్వామి ప్రమాణానికి నేను వెళ్లాను. అక్కడ అన్న పార్టీల నేతలతో సమావేశమయ్యాను. అందరు నేతలూ తెలుగు ప్రజలకు అన్యాయం జరగకుండా ముందుకొస్తారని నాకు అనిపించింది.  2019లో టిడిపి లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనది కీలక పాత్ర కాబోతున్నది. అప్పుడు నేషనల్ ఫ్రంట్ పెట్టి ఇద్దరు ప్రధానమంత్రులను ఎంపిక చేశాము. 2019 తర్వాత కూడా టిడిపి కీలక శక్తిగా దేశంలో ఉంటుంది. దీనికోసం అందరు కార్యకర్తలు సద్ధం కావాలి.

మనకు న్యాయం జరగాలంటే దేశంలో రెండు రాష్ట్రాలు కీలక శక్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. బిజెపి పార్టీ వారు వెంకటేశ్వర స్వామిని కూడా కాంట్రవర్సీలోకి తీసుకొస్తున్నారు. ఆ దేవుడి వద్ద ఉండే ఆభరణాలన్నీ నాదగ్గర ఉన్నాయని అంటున్నారు. రికార్డులో లేని వజ్రం నాదగ్గర ఉందని అంటున్నాడు. వీళ్లు ఏమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని నిలదీశారు. 24 క్లెమోర్ మైన్స్ నామీద ప్రయోగం చేసినప్పుడు ఈ తెలుగు జాతికి సేవ చేయాలని నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామే.

వెంకటేశ్వర స్వామి దగ్గర నాటకాలు ఆడితే ఇంకో జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్షిస్తాడు. అంతటి పవర్ ఫుల్ గాడ్. ఆయనతో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. ఆయన పవిత్రత కాపాడేందుకే ఆయన పాదాల దగ్గర పుట్టానని చెబుతున్నను అన్నరు. బిజెపి ఇలాంటి నాటకాలు చాలా ఆడతారు. అందరిదగ్గర మాదిరిగానే నాటకాలు ఆడాలనుకున్నారు కానీ తెలుగు జాతి దగ్గర నాటకాలు చెల్లవు అని హెచ్చరించారు. చివరగా జై తెలంగాణ అని చంద్రబాబు నినదించారు. ఎన్టీఆర్ అమర్ రహే అన్నారు. అంతేకాదు జై తెలంగాణ అని కార్యకర్తలతో నినాదాలు చేయించారు. ఇలా చాలారోజుల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ లో తెలంగాణ కార్యకర్తల సమావేశంలో కొత్త స్టయిల్ లో మాట్లాడి కొత్త చర్చను లేవనెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios