హుజూర్ నగర్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమను బలపరచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కోరారు. 

హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో హుజూర్ నగర్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పలువురు నేతలు ఆయనకు సూచించారు. పోటీ చేయడం ద్వారా క్యాడర్ ను నిలుపుకునే ప్రయత్నం చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. 

హుజూర్ నగర్ లో అభ్యర్థిని పోటీకి దింపే విషయంపై శనివారం నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. హుజూర్ నగర్ టీడీపి అభ్యర్థులుగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.