కేసీఆర్ పై బాబు నో కామెంట్: జగన్ మాటే నిజమా, లేదంటే...

Chandrababu targets BJP, spares KCR
Highlights

సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు సంధించడం పరిపాటి.

హైదరాబాద్: సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు సంధించడం పరిపాటి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలంటే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాల్సిందే. కానీ, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పల్లెత్తు మాట కూడా అనలేదు.

గురువారం జరిగిన తెలంగాణ మహానాడులో చంద్రబాబు బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని అమలు చేయలేదని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే మిగిలింది. ఇటువంటి స్థితిలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే అధికార పార్టీని లక్ష్యం చేసుకుని చంద్రబాబు ప్రసంగం సాగాల్సి ఉండిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పల్లెత్తు మాట అనలేదు.

చంద్రబాబు కేసీఆర్ ను లక్ష్యం చేసుకోకపోవడం వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి - వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శ కాగా రెండోది - వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపి అనుసరించే వ్యూహం.

వైఎస్ జగన్ చేసే విమర్శ విషయానికి వస్తే... ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడం వల్లనే కేసిఆర్ తో చంద్రబాబు రాజీ పడ్డారనేది ఆయన చేసే విమర్శ. పదేళ్ల పాటు హైదరాబాదు నుంచి పాలన చేసే అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసు వల్లనే విజయవాడకు వెంటనే మకాం మార్చేశారని కూడా ఆయన అంటున్నారు. 

జగన్ లేదా ఆ పార్టీ నాయకుల విమర్శల్లో నిజానిజాలు ఏమిటనేది తెలియదు. జగన్ విమర్శలను నిర్ధారించడానికి తగిన సాక్ష్యాధారాలు ఏవీ లేవు. జగన్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యం. అధికారంలో ఉన్న చంద్రబాబును లక్ష్యం చేసుకోవడం ఆయనకు రాజకీయావసరం. అందులో భాగంగానే జగన్ ఆ ఆరోపణలు చేస్తుండవచ్చు కూడా. అయితే ఓటుకు నోటు కేసు చంద్రబాబును చిక్కుల్లో పడేసిన విషయం మాత్రం వాస్తవం.

రెండో విషయానికి వస్తే, దీనికి కాస్తా హేతుబద్దత కనిపిస్తోంది. తెలుగుదేశం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకునే దిశగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహం సందర్భంగానే అనంతపురంలో దానికి పాదులు పడ్డాయనే విషయం అందరికీ తెలిసిందే.

కేసీఆర్ కు కావాల్సింది కూడా అదే. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది. టీఆర్ఎస్ కు ఎంత లేదన్న ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెసు. ఈ పార్టీలో రెడ్డి సామాజికవర్గానిది పైచేయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి కూడా అంతే. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనేది చంద్రబాబు, కేసీఆర్ ల ఉమ్మడి ఎజెండా అని అంటారు. 

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరి రాజకీయ లక్ష్యం ఒక్కటైనప్పుడు కలిసి పనిచేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందులో భాగంగానే చంద్రబాబు తెలంగాణ మహానాడులో కేసీఆర్ ను గానీ, ఆయన ప్రభుత్వాన్ని గానీ, ఆయన పార్టీని గానీ పల్లెత్తు మాట అనలేదని చెప్పవచ్చు.

కొసమెరుపు ఏమిటంటే, ఇటు తెలంగాణ మహానాడు జరుగుతుండగానే, బాలకృష్ణకు చెందిన  బసవతారకం ఇండో కేన్సర్ ఆస్పత్రిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించారు. బాలకృష్ణ సంస్థకు పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. 

- కె. నిశాంత్

(రచయిత అభిప్రాయాలతో ఏసియానెట్ న్యూస్ కు సంబంధం లేదు. ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా రచయితవే)

loader