Asianet News TeluguAsianet News Telugu

బాబు 'కల్యాణ్ రామ్' వ్యూహం: ఎన్టీఆర్ కు చెక్, లోకేష్ లైన్ క్లియర్

కల్యాణ్ రామ్ ను వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దించాలనే యోచన నిజమే అయితే, దాని  ద్వారా ఒక దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Chandrababu strategy in fielding Kalyanram
Author
Hyderabad, First Published Sep 20, 2018, 11:47 AM IST

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తున్నారు. కల్యాణ్ రామ్ ను వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దించాలనే యోచన నిజమే అయితే, దాని  ద్వారా ఒక దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

హరికృష్ణ మృతి తర్వాత నందమూరి కుటుంబ సభ్యులు ఏకమైనట్లు కనిపించారు. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తోనూ కల్యాణ్ రామ్ తోనూ కలివిడిగా మాట్లాడారు. దూరంగా ఉంటూ వచ్చిన హరికృష్ణ, బాలకృష్ణ కుటుంబాలు దగ్గరవుతున్న సూచనలు కనిపించాయి. మరో వైపు హరికృష్ణ కటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖరరావుకే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు కూడా చెక్ పెడుతూ తన కుమారుడు నారా లోకేష్ కు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ లేకుండా చేయకుండా చంద్రబాబు ఎత్తు వేసినట్లు కనిపిస్తున్నారు. 

కల్యాణ్ రామ్ అభ్యర్థిత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ అనివార్యంగా బలపరచాల్సి వస్తుంది. దాంతో తెలంగాణ రాజకీయాలకు హరికృష్ణ కుటుంబాన్ని పరిమితం చేయడానికి వీలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక వేళ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా తెలంగాణకే పరిమితం కావాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కల్యాణ్ రామ్ కు టికెట్ ఇచ్చిన తర్వాత ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించడం సరి కాదనే వాదన కూడా ముందుకు వస్తుంది. తద్వారా ఎన్టీఆర్ పాత్ర రాజకీయాల్లో పరిమితం అయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నందమూరి హరికృష్ణ కుటుంబం ప్రవేశించకపోతే తన కుమారుడు నారా లోకేష్ కు భవిష్యత్తులో కూడా ఏ విధమైన చిక్కులు ఏర్పడవనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కాదనకుండా, పూర్తిగా ఆయన అవకాశం కల్పించకుండా చూడడం అనేది చంద్రబాబుకు అవసరంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

దానికితోడు, తెలంగాణ దివంగత ఎన్టీ రామారావుకు అభిమానులు దండిగానే ఉన్నారు. వారు కల్యాణ్ రామ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలుంటాయి. పైగా, కూకట్ పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కల్యాణ్ రామ్ ను పోటీకి దించితే విజయం సాధించడం కూడా కష్టం కాకపోవచ్చు. కల్యాణ్ రామ్ గెలిస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతారనే ఒక అంచనా కూడా ఉంది. దానికి తోడు, ఎన్టీఆర్ అభిమానులు కేసిఆర్ కు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారనే వ్యూహం కూడా కల్యాణ్ రామ్ ను పోటీకి దించాలనే ఎత్తుగడలో ఉన్నట్లు భావిస్తున్నారు.

తెలంగాణ టీడీపి నాయకులు చాలా కాలంగా తమకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాయకత్వం కావాలని అడుగుతున్నారు. అలాంటి సందర్భంలో ప్రధానంగా ముందుకు వచ్చిన పేర్లు నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్. నారా బ్రాహ్మణిని తెలంగాణ రాజకీయాల్లోకి దించే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ కు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. అందువల్ల కల్యాణ్ రామ్ ను తెలంగాణ రాజకీయాల కోసం ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. దానిద్వారా తెలంగాణ టీడీపీ నాయకుల కోరిక కూడా తీర్చినట్లవుతుంది. మొత్తం మీద, కల్యామ్ రామ్ ను పోటీకి దించాలనే చంద్రబాబు వ్యూహంలో భవిష్యత్తు రాజకీయాలను నిర్దేశించాలనే అంశం ఇమిడి ఉన్నట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్త

'మహా' వ్యూహం: ఎన్నికల బరిలో సినీ హీరో కల్యాణ్ రామ్

Follow Us:
Download App:
  • android
  • ios