హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీసేందుకు మహాకూటమి పకడ్బందీ వ్యూహాన్నే రచిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రముఖ రాజకీయ నాయకుల వారసులను ఎన్నికల బరిలోకి దింపేందుకు మహా కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దివంగత నేత ఎన్టీ రామారావు మనవడు, హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం ప్రకారం.... కాంగ్రెసు, టీడీపి, తెలంగాణ జనసమితి టీఆర్ఎస్ పై అమీతుమీ తేల్చుకునేందుకు తగిన వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ హీరో కల్యాణ్‌రామ్‌ను మహాకూటమి తరఫున శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపేందుకు టీడిపి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
 
కాంగ్రెస్ తో పొత్తుల చర్చల్లో తమకు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి శాసనసభ స్థానాలు కేటాయించాలని టీడీపి నేతలు కోరారు. కాంగ్రెస్‌ నేతలు కూడా కల్యాణ్‌రామ్‌ను పోటీకి దించే ఆలోచనకు జైకొట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఆ సీటు వదులుకోవడానికి సిద్ధమేనని అంగీకరించినట్లు తెలిసింది. 

కల్యాణ్‌రామ్‌ కుటుంబ సభ్యులతో కొంత మంది టీడీపి నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ పోటీపై త్వరలోనే స్పష్టత వస్తుందని టీడీపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
 
అదే సమయంలో మాజీ  ముఖ్యమంత్రి, దివంగత నేత చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డిని తెలంగాణ జనసమితి నుంచి పోటీకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల  కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి (టీజెఎస్)లో చేరిన విషయం తెలిసిందే. మంత్రి మహేందర్‌రెడ్డిపై ఆయనను పోటీకి దింపాలని అనుకుంటున్నారు.