హైదరాబాద్:ఎన్టీఆర్ తెలుగు వారి ఆస్తి, స్పూర్తి అని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. భావితరాలకు ఎన్టీఆర్ స్పూర్తిగా నిలుస్తారన్నారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మనమడు దేవాన్ష్ లతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఎక్కడా కూడ రాజీపడకుండా ముందుకు నడిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ను చూస్తే దేవుడిని నిజరూపంలో చూసినట్టే ఉండేదని ఆయన చెప్పారు. ప్రతి చిత్రంలో కూడ ఎన్టీఆర్ తాను  పోషించిన పాత్రకు న్యాయం చేశాడన్నారు. ప్రతి పాత్రకు న్యాయం చేసేలా ఆ పాత్రలో జీవించాడని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

also read:ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేవారే నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడని బాబు తెలిపారు.  ప్రతి తెలుగువాడి గుండెల్లో ఎన్టీఆర్ నిలిచిపోతాడని ఆయన చెప్పారు. రాజకీయాల్లో చాలా తక్కువ కాలం ఉన్నప్పటికీ ప్రజల మౌళిక సదుపాయాలను తీర్చడంలో ఎన్టీఆర్ కీలకంగా వ్యవహరించాడని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో తీసుకొచ్చిన రూ. 2 కిలో బియ్యం ఇవాళ పేదలకు పుడ్ సెక్యూరిటీగా మారిందన్నారు.ఎన్టీఆర్ దూరదృష్టితో ఆలోచించే వ్యక్తిగా ఆయన చెప్పారు.