తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం సమాచారం పంపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్దంగా ఉన్నట్టు కేంద్రం లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05 లక్షల టన్నులకు అదనంగా.. బియ్యం సేకరించాలని నిర్ణయించినట్టుగా కేంద్రం లేఖలో పేర్కొంది.
ఇందుకు అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు ధన్యవాదాలు చెప్పారు.
