తెలంగాణ బిజెపి కార్యకర్తలు బాధపడుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావంతో 2019 నాటికి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న కసితో ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపి నేతల ఉత్సాహంపై కేంద్ర బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు నీళ్లు చల్లుతున్నారు. దీంతో ఇక్కడి వారు సంకట స్థితికి నెట్టబడుతున్నారు.ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావడంతో ఇటు ప్రజా ఉద్యమాలు చేయలేక అటు అధికార పార్టీతో అంటకాగలేక సతమతమవుతున్నది. ఒకవైపు ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతోపాటు జెఎసి కూడా ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచాయి. కానీ బిజెపి మాత్రం ఇంకా ఆఫీసులో నుంచి బయటకు కాలు పెట్టిన వాతావరణం కనిపించడంలేదు.

తాజాగా తెలంగాణ విమోచనం పేరుతో కొంత హడావిడి చేస్తున్నది. కానీ ఆ పార్టీకి జోష్ వచ్చే అవకాశాలను ఆ పార్టీ కేంద్ర శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన పార్టీ కేడర్ లో నెలకొంది. గడచిన ఐదారు నెలల కాలంలో కేంద్రం నుంచి మంత్రులంతా విమానాలు ఎక్కి రావడం కేసిఆర్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తి వెళ్లిపోవడం  జరుగుతూ వస్తున్నది. నిన్నటికి నిన్న కేంద్రమంత్రి మేనకా గాంధీ కేసిఆర్ సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించి పోయారు.

అంతకంటే ముందు స్వయంగా ప్రధాని మంత్రి కేటిఆర్ కు ఒక లేఖ రాస్తూ మిషన్ భగీరథ బాగుందని కితాబిచ్చారు. అంతకంటే ముందు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ వచ్చి తెలంగాణ సర్కారును ఆకాశానికెత్తి వెళ్లిపోయారు. కొందరు మంత్రులైతే తమ ప్రాంతంలో ఉండి అక్కడినుంచే కిసిఆర్ సర్కారు భేష్ అంటూ సందేశాలు పంపుతున్నారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ బిజెపి శాఖను కలవరపెడుతున్నాయి. అయినా ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు తమ ప్రభుత్వ గొప్పదనం గురించి చెప్పుకోవాలని కానీ ఇక్కడి సర్కార్ పై పొగడ్తలు కుమ్మరించిపోవడమేంటో అంతుచిక్కడంలేదని స్థానిక నేతలు అంటున్నారు.

ఒకవైపు తెలంగాణ బిజెపి సొంతంగా కాకపోయినా అఖిలపక్షం పేరుతో కొద్దిగా కదులుతున్నది. నేరెళ్ల దిళుతలపై థర్డ్ డిగ్రీ విషయంలో అఖిలపక్షంలో బిజెపి కూడా యాక్టీవ్ గానే పార్టిసిపేట్ చేసింది. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇక్కడి పార్టీని కదలనిస్తలేని పరిస్థితి ఉత్నన్నమైంది.

ఈ పరిణామాలు చూసిన స్థానిక నాయకత్వం అసలు తెలంగాణ బిజెపి శాఖ పట్ల కేంద్రం కానీ, కేంద్ర పార్టీ కానీ ఏరకమైన అభిప్రాయంతో ఉన్నదో తెలుస్తలేదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి టిఆర్ఎస్ పార్టీ కేంద్రంతో దోస్తీ చేస్తూ రాష్ట్రంలో వైరం ప్రదర్శిస్తున్న తీరు స్థానిక బిజెపి నేతలకు నచ్చడంలేదు. అయితే ఈ విషయంలో టిఆర్ఎస్ తీరు కంటే తమ అధిష్టానం తీరుతోనే బాగా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు స్థానిక నేతలు.

అందుకే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయారు స్థానిక నాయకులు. దీంతో ఇరత రాజకీయ పార్టీల నేతలతో బిజెపి కేడర్ చర్చిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే గత వారం టిడిపి నేత రేవంత్ రెడ్డి తెలంగాణ బిజెపి శాఖను మూసేసుకోరాదురి అంటూ ఘాటుగానే విమర్శించారు. ఇక్కడి నాయకులేమో కేసిఆర్ సర్కారు మీద పోరాడతామంటుంటే రోజుకో కేంద్ర మంత్రి వచ్చి ఉన్నది లేనిది చెప్పి ఆహా కేసిఆర్ ఓహో కేసిఆర్ అని ప్రశంసలు ఎందుకు ఇస్తున్నారని రేవంత్ గట్టిగానే నిలదీశారు.

ఢిల్లీ పెద్దల తీరుతో తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైందని ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పార్టీకి, ప్రభుత్వానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్లు ఆయన ఏషియా నెట్ కు వివరించారు. మేమేం చేయాలో చెప్పండి అని కేంద్ర పార్టీనే అడగదలుచుకున్నట్లు ఆయన చెప్పారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి