ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముకుంటోంది :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Hyderabad: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 13 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదన్నారు.

BRS Mlc Kalvakuntla Kavitha: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముకుంటోందని ఆరోపించారు. సింగరేణి, బీహెచ్‌ఈఎల్ వంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి విక్రయిస్తోందని ఆమె అన్నారు. అలాగే 13 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
"తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. కానీ, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు భాజపా చీఫ్ బండి సంజయ్ బాధపడ్డారని, ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన తమ జెండాలు పట్టుకునే వారు లేరనే బాధగా ఉందని" ఆమె అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తూ ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా విజయవంతం కావడానికి ఉద్యోగులే ప్రధాన కారణమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలుబొమ్మలంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. ఉద్యోగులు కేసీఆర్ తోలుబొమ్మలు కాదనీ, వారు తనకు ఆత్మీయులని అన్నారు. "ఉద్యోగులు- ప్రభుత్వం వేరు కాదు," ఆమె చెప్పారు. టీఎన్జీవో, తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఉద్యోగులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను ప్రజలకు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చాలాసార్లు వెల్లడించారని గుర్తు చేశారు.
ఉద్యోగుల వల్లే కేసీఆర్ కిట్, భూసంస్కరణలు వంటి ఎన్నో కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారతదేశంలో ఏ అవార్డులు ఇచ్చినా మొదటి మూడు అవార్డులు తెలంగాణకే దక్కుతాయని, కేసీఆర్ ఆలోచనతో పాటు ఉద్యోగుల కష్టాలు కూడా ముఖ్యమని ఆమె అన్నారు. తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని కూడా ఆమె తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ నాయకులు తమ వెనకాల జెండాలు పట్టుకునే వారు లేరని బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తుంటే బండి సంజయ్ బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు.