Asianet News TeluguAsianet News Telugu

జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ .. ఇంటింటికీ నీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా అవార్డ్

తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు అందుకున్న రాష్ట్రం... తాజాగా దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. 

center gave award to telangana's mission bhagiratha
Author
First Published Sep 28, 2022, 10:16 PM IST

దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ‌ నిలిచింది. శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ.. అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. ఇందుకు గానూ కేంద్రం మిష‌న్ భ‌గీర‌థ‌కు అవార్డు ప్ర‌క‌టించింది. ఈ అవార్డును గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబ‌ర్ 2వ తేదీన రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ మేర‌కు ఢిల్లీకి రావాల‌ని కేంద్ర జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అడిష‌న‌ల్ సెక్ర‌ట‌రీ, మిష‌న్ డైరెక్ట‌ర్ వికాస్ శీల్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆహ్వానం పంపారు. మిషన్ భగీరథకు అవార్డ్ రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, ఆయన బృందాన్ని, అధికారులను, సిబ్బందిని, స్థానిక ప్రజాప్రతినిధులను సీఎం అభినందించారు. 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని మంచినీటి సరఫరాలో జాతీయ స్థాయిలో పలు అవార్డులు రివార్డులు వరించిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలో 100% ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు లభించింది. అంతేకాదు.. 100% ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కింది. తాజాగా దేశంలో అత్యుత్తమ, అద్భుత ప్రతిభ కనబరచిన రాష్ట్రంగా తెలంగాణకు అవార్డు లభించింది. గతవారం స్వచ్ఛ సర్వే‌క్షణ్‌లో రాష్ట్రానికి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులు వరించాయి. ఈ అవార్డులను కూడా అక్టోబర్ 2వ తేదీనే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనుంది తెలంగాణ రాష్ట్రం. ఒకే రోజు 14 అవార్డులు స్వీకరించనుండం విశేషం. ఇందుకోసం రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్లనున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారుల బృందం. 

ALso Read:'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' ర్యాంకింగ్స్‌.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారం వల్లే ఈ అవార్డులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. తనతో పాటు అహర్నిశలు పనిచేస్తున్న తన సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరినీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని మంత్రి వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios