తెలంగాణలో గత కొన్ని నెలలుగా నడిచిన ధాన్యం కొనుగోలు వివాదానికి తెరపడింది. బియ్యం సేకరణకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు. 

తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. బుధవారం మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకి క్లియరెన్స్ ఇస్తుందన్నారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని కేంద్ర మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. దీనిపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవు పలికారు. 

రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని పీయూష్ గోయల్ ఆరోపించారు. తెలంగాణ సర్కారు తీరుతోనే పేదలకు బియ్యం అందడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నిసార్లు లేఖ రాసినపా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేదేమీ లేదని.. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని పీయూష్ గోయల్ దుయ్యబట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని పీయూష్ గోయల్ ఆరోపించారు. 

ALso REad:తెలంగాణ : ఎఫ్‌సీఐ నుంచి రాని ఆదేశాలు.. రైస్ మిల్లుల్లో గుట్టలకొద్దీ ధాన్యం, వర్షానికి మొలకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పరిస్ధితి, రైస్ మిల్లర్ల పరిస్ధితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించామన్నారు. నేరుగా ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన వివరించారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేశారో ఇప్పటికీ అర్ధం కావడం లేదని కిషన్ రెడ్డి చురకలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాని సమస్యలు తెలంగాణలో ఎందుకొస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. పోషకాలున్న ప్రోటీన్ రైస్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించామని కిషన్ రెడ్డి తెలిపారు. మేం భయపడం, పారిపోం... చర్చకు సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు. క్లౌడ్ బరస్ట్ ఆరోపణలపై దర్యాప్తునకు కేంద్రం సిద్ధంగా వుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.