తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ ఓపీ రావత్. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా, సిబ్బంది పంపిణీ తదితర కార్యక్రమాల నిమిత్తం సీఈసీ రావత్ తెలంగాణలో పర్యటించారు.

వివిధ రాజకీయ పార్టీలతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించని ఆయన ఇవాళ తాజ్‌కృష్ణలో మీడీయాకు వివరాలు తెలిపారు. మూడు రోజుల పాటు రాజకీయ పార్టీలు, అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు.

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఈసీ స్పష్టం చేశారు.. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నాయని.. వాటిని సవరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని వినతులు వచ్చాయని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటామని రావత్ తెలిపారు.

పొరుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారులపై నిఘా పెట్టాలని కొన్ని పార్టీలు సూచించాయని.. అలాగే పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ ప్రకటనలను మానిటర్ చేయాలని కొన్ని పార్టీలు సూచించాయని ఓపీ రావత్ పేర్కొన్నారు. పోలింగ్ యంత్రాలకు సంబంధించిన సమస్యలపై సీ-డాక్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు.